‘నవ్వడం
ఒక యోగం అయితే నవ్వించడం మహా కష్టం!’ మొదటి దానితోపాటు రెండోదాన్ని కూడా
సునాయాసంగా చేసేస్తూ వెండితెర మీద నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు
కమెడియన్ సప్తగిరి! కొందరు హావ భావాలతో నవ్విస్తే, మరికొందరు నటనతో
నవ్విస్తారు. కానీ సప్తగిరి మాత్రం తన యాసతోనే నవ్వు తెప్పిస్తాడు.
అసిస్టెంట్ డైరెక్టరుగా పరిశ్రమలో అడుగుపెట్టి కమెడియన్‌గా మారి
‘బొమ్మరిల్లు’తో మొదలుపెట్టి ‘పరుగు’ పెడుతున్న మగజాతి ఆణిముత్యం సప్తగిరితో...
మీకు మీరే పెట్టుకున్నారా?
నేను
వెంకటేశ్వరస్వామి భక్తుణ్ణి. ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు నిలబడి కొండను
చూస్తూ ఉండిపోయాను. అటుగా వస్తున్న సాధువుల్లో ఒక పెద్దాయన బాబూ ‘సప్తగిరి’
కాస్త పక్కకి జరుగు అనడంతో టక్కున పక్కకి జరిగాను. ఈ పేరేదో బాగుందే
అనుకున్నాను. ఇంట్లో అందరూ నన్ను గిరి అంటారు. దాంతో సప్తని ముందు
తగిలించుకుని ‘సప్తగిరి’ అని పెట్టుకున్నాను.
దర్శకత్వం నుంచి నటనవైపు ఎందుకు మళ్ళారు?
‘పరుగు’
సినిమాకు భాస్కర్‌గారితో చేశాను. ఒక కొత్త కమెడియన్ క్యారెక్టర్ ఉంది. ఆ
కమెడియన్ పాత్రను నన్నే చేయమన్నారు. నాకు అసలు నటన మీద దృష్టే లేదు. కానీ
భాస్కర్‌గారు చెప్పారని ఒప్పుకున్నాను. కొత్త ఫేసు, దానికి తోడు నా యాస
కొత్తగా ఉండటంతో ఆ పాత్రని చాలా బాగా ఆదరించారు. చిత్తూరు యాస సహజంగానే
కొద్దిగా నవ్వు తెప్పిస్తుంది. దానికి కొద్దిగా కామెడీ జోడించాను అంతే!
అంతకు మించి నేను పెద్దగా చేసిందీ, చేస్తున్నదీ ఏమీ లేదు.
మిగతా వారికీ మీకూ అదే తేడానా?
కచ్చితంగా
ఇదే తేడా. పరిశ్రమలో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో యాసతో
మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ! నేను బయట ఎలా మాట్లాడతానో, తెర మీద కూడా అదే
యాసతో మాట్లాడడంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు.
కమెడియన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందా?
పోటీ
అనేది ఎక్కడైనా ఉంటుంది. కానీ మా మధ్య ఉన్నది ఫ్రెండ్లీ పోటీనే! అందరం
చక్కగా కలుసుకుంటాం. మాట్లాడుకుంటాం. ఒకరిని చూసి మరొకరు అసూయ పడడం అంటూ
ఉండదు. అందరికీ మంచి అవకాశాలే ఉన్నాయి.
ఎక్కువగా ఇష్టపడే కమెడియన్?
బ్రహ్మానందం
గారే! ఆయన స్కూప్‌లు ఒకటి రెండు నేను నా సినిమాల్లో వాడేశాను కూడా! వాటిని
చూసి ఆయన నాకు ఫోన్ చేసి ‘బాగా చేశావు’ అంటూ అభినందించారు. ఇప్పటికీ తరచు
ఆయనకు నేను ఫోన్ చేయడమో, లేక ఆయనే నాకు ఫోన్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఒక
విధంగా ఆయనే నాకు ఆదర్శం.
మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా?
‘ప్రేమ
కథా చిత్రం’. నన్ను స్టార్ కమెడియన్‌గా చేసిన సినిమా. ఆ సినిమాలో నా నటన
అందరిని బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నేను చేసిన సినిమాలన్నీ నాకు
ఇష్టమైనవే!
మీకు మీరుగా బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా?
‘వెంకటాద్రి
ఎక్స్‌ప్రెస్’. ‘ప్రేమ కథా చిత్రం’లో నేను నవ్వించానని అందరూ అన్నారు.
కానీ నేను అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’
షూటింగ్ సమయంలోనే బాగా ఎంజాయ్ చేశాను.
బాగా ఇష్టపడే హీరో?
అందరూ
ఇష్టమైన వారే! ఎవరికి వారే చాలా బాగా చేస్తారు. కానీ అల్లు అర్జున్‌గారంటే
మాత్రం మిగతా వారి కంటే కొద్దిగా ఎక్కువ ఇష్టపడతాను. ‘పరుగు’ సమయంలో
ఆయన్ని చాలా దగ్గర్నుంచి చూశాను. సినిమా కోసం ఎంతగా కష్టపడతారో చెప్పలేను.
మిగతా హీరోల విషయంలో నేను అంత దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం రాలేదు. ఒక్క
అల్లు అర్జున్‌గారి విషయంలోనే ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కష్టం ఏమిటో
తెలిసింది.
మరి డైరెక్టర్లలో ఎవర్ని లైక్ చేస్తారు?
పరిశ్రమలో
నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన దర్శకులు ఇద్దరున్నారు. ఒకరు ‘బొమ్మరిల్లు’
భాస్కర్ గారు. మరొకరు మారుతి గారు. వీరిద్దరూ నన్ను బాగా ప్రోత్సహించిన
వారే! నీకు ఎలా తోస్తే అలా చేయి! బయట ఎలా ఉంటావో తెర మీద కూడా అలాగే
కనిపించు! అని నన్ను ప్రోత్సహించారు. నిజం చెప్పాలంటే మొదటి సినిమా నుంచి
ఇప్పటి దాకా నేను హోంవర్క్ చేసిందంటూ ఏం లేదు. షూటింగ్‌కి రావడం,
అప్పటికప్పుడు డైరెక్టర్‌గారు ఎలా చెబితే అలా చేసుకుంటూ పోవడం అంతే! చాలా
మందికి తెలియని సంగతి ఒకటుంది. నాకు అస్సలు నటన రాదు.
దర్శకత్వం మీద మనసు పోలేదా?
ఏడెనిమిది
సంవత్సరాల క్రితం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన అస్సలు రాదు. ఎందుకంటే
కమెడియన్‌గా బాగా క్లిక్ అవుతున్నాను. దీన్ని విడిచి దర్శకత్వం వైపు
వెళ్ళడం ఎందుకు అనిపిస్తుంది? దర్శకత్వం అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది.
ఇప్పుడు నటించడమే సులభమని అనిపిస్తోంది.
దర్శకుడవ్వాలని ఎందుకు అనుకున్నారు?
చదువుకునే రోజుల్లో ‘సింధూరం’ సినిమా చూసిన తరువాత ఎప్పటికైనా దర్శకుడినై ఇలాంటి సినిమా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాను.
చదువుకునే రోజుల్నించే సినిమాలంటే ఇష్టం ఏర్పడిందా?
చదువు
కన్నా సినిమాలంటే ఇష్టంగా ఉండేది. చదువు బాగా రాలేదు. దానికి రెండు
కారణాలు. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. క్రికెట్ ప్లేయర్ని అవ్వాలని
ఉండేది. మధ్యలోనే దాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చేశాను.
చదువుకోకుండా సినిమాల్లోకి వస్తే పేరెంట్స్ ఏమనలేదా?
ప్రారంభంలో
కొద్దిగా బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఫుల్ హ్యాపీ. మా ఫాదర్ అయితే నా
సినిమా విడుదలైన రోజు ధియేటర్‌కి వెళ్ళి ఓ యాభై టిక్కెట్లు కొనేసి
టిక్కెట్లు దొరకని వారికి ఫ్రీగా ఇచ్చి సినిమా చూడండి అని
పంపించేస్తుంటారు. అలా చాలా సార్లు చేశారు.
అభిమానుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది?
నా
అభిమానులు పిల్లలే! పిల్లలే ఎక్కువగా నన్ను గుర్తుపట్టి సప్తగిరి,
సప్తగిరి అని అరుస్తూంటారు. వారి వెంట ఉన్న పెద్దలు నన్ను ముందు గుర్తు
పట్టకపోయినా, పిల్లల అరుపులు విని నా దగ్గరకి వస్తూంటారు. అందరికీ పెద్ద
అభిమానులుంటే నాకు పిల్ల అభిమానులు ఎక్కువ!
రెమ్యునరేషన్ పెంచేశారన్న మాట నిజమేనా?
ఈ
మాట నా దాకా కూడా వచ్చింది. మొదట్నించీ ఎవరినీ డిమాండ్ చేయడం నాకు అలవాటు
లేదు. నా కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకుంటాను. కాల్‌షీట్లను బట్టి నాకు
రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఎక్కువ రోజులు పనిచేస్తే ఎక్కువ మొత్తం, తక్కువ
రోజులు చేస్తే తక్కువ మొత్తం ఇస్తారు.
source:ఆంధ్రజ్యోతి
EmoticonEmoticon